రాజమౌళిని మించి... కథ రచించిన బాలుడు... హాస్టల్'కి వెళ్లడం ఇష్టం లేక కిడ్నాప్ డ్రామా..
ఓ బుడ్డోడు దర్శక నిర్మాత రాజమౌళిని మించి కథను అల్లాడు... స్కూల్ కు వెళ్లడం ఇష్టం లేక సినిమాను తలపించే రేంజ్ లో స్టోరీని దింపేశాడు. కిడ్నాప్ కథ అల్లి ఇంటికి చేరుకుని, వ్యవహారం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కే వరకు తీసుకెళ్లాడు. రంగంలోకి దిగిన పోలీసులు అసలేం జరిగింది అనే కోణంలో నిశితంగా పరిశీలించి అసలు విషయం రాబట్టారు. చిన్నోడి కిడ్నాప్ కథకు పోలీసులే ముక్కున వేలేసుకున్నారు. చిన్నోడైనా మామూలు స్కీన్ ప్లే చూపించలేదని అనుకున్నారు. ఈ సందర్భంగా బాలుడి కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించిన వివరాలను మంగళవారం రేగొండ పోలీసుల వెల్లడించారు. వారి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. సోమవారం రేగొండలో బాలుడి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన ఓ ఆరో తరగతి చదవే బాలుడికి జాకారం సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో సీటు వచ్చినా హాస్టల్ కు వెళ్లడం ఇష్టం లేక ఇంటి నుంచి పారిపోయాడు. ఇప్పటికే నెల రోజులుగా ఇంటి పట్టునే ఉంటున్న బాలున్ని సోమవారం హాస్టల్ లో దింపి వస్తానని, హోటల్ కు వెళ్లి టిఫిన్ చేసి రమ్మని తల్లి డబ్బులిచ్చి పంపిస్తుంది. బయటకెళ్లిన బాలుడు భూపాలపల్లి, పరకాల ప్రధాన రహదారిపై ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగా బస్ ఎక్కి పరకాలకు చేరుకున్నాడు. అదే బస్సులో వెంకటేశ్వర్లపల్లి కి చెందిన కాలేజీ విద్యార్థి రవి తేజ కూడా ఎక్కిన విజువల్స్ బంక్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయని పోలీసులు తెలిపారు. కాగా రవితేజ అబ్బాయిని ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నిస్తే ‘‘మా తాత ఆరోగ్యం బాగలేక ఆస్పత్రిలో ఉన్నాడని, అమ్మ కూడా అక్కడే ఉందని..’’ చెప్పి పరకాలకు చేరుకుంటాడు. అక్కడ టాటా మ్యాజిక్ వాహనంలో హన్మకొండకు వెళ్తాడు. వాస్తవానికి హన్మకొండలోని అక్క ఇంటికి వెళ్లాలని అనుకున్నా అడ్రస్ మరిచిపోవడంతో కిడ్నాప్ డ్రామాకు తెరలేపాడు. అప్పటికప్పుడు ఒక దుకాణంలో కొబ్బరి తాడు తీసుకుని, అటుగా వెళ్తున్న ఓ స్కూల్ పిల్లాడితో తాడు చేతులకు కట్టించుకుంటాడు. అక్కడే రోడ్డుపై కూర్చుని ఏడుస్తున్నట్టు నటించడంతో sk. పాషా అనే మెకానిక్ గమనించగా అబ్బాయి ని వివరాలు కనుక్కొని తల్లికి ఫోన్ చేస్తాడు. తాను ఇంటి నుంచి పారిపోయి వచ్చాననే కోపంతో అన్నయ్య, అమ్మ కొడుతారనే ఇలా కిడ్నాప్ డ్రామా అడినట్టు పిల్లాడు చెప్పిన వీడియో ఉందని పోలీసులు తెలిపారు. కానీ, మైనర్ బాలుడు కావడంతో విడుదల చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. సదరు అబ్బాయిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని, కేవలం తల్లిని వదిలి హాస్టల్ కి వెళ్లడం ఇష్టం లేక భయంతో చెప్పిన అబద్ధమని పోలీసులు వివరించారు.
రాజమౌళిని మించి... కథ రచించిన బాలుడు... హాస్టల్'కి వెళ్లడం ఇష్టం లేక కిడ్నాప్ డ్రామా..
Reviewed by Ashu Yadav
on
10:27 AM
Rating:
No comments: