ఆ కేసులకు జైలు లేదు.. ఫైన్ మాత్రమే.. II చలనాలపై బంఫర్ ఆఫర్ ప్రకటించిన పోలీస్ శాఖ
- టూ వీలర్, త్రీ వీలర్లకు భారీ రాయితీ
- చలానా మొత్తంలో పావలా వంతు చెల్లిస్తే చాలు
- కార్లు, లారీలకు పడిన జరిమానాల్లో 50శాతం తగ్గింపు
- మందు బాబులకు చక్కని అవకాశం
- డ్రంక్ డ్రైవ్ కేసుల వన్ టైం క్లియరెన్స్
- నేటి నుంచి అమలు
ట్రాఫిక్ చలానాలపై అధికారులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పెద్ద మొత్తంలో చలానాలు చెల్లించలేక సతమతమవుతున్న వాహనదారులకు శుభవార్త వినిపించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనుల్లో అధికంగా ద్విచక్ర త్రిచక్ర వాహనదారులే ఉండే అవకాశం ఉంది. హెల్మెట్లు ధరించకపో వడం, ఓవర్ స్పీడ్ లాంటి చలానాలే అధికం. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ద్విచక్ర, త్రిచక్ర వాహనదారులకు భారీగా రాయితీ ఇచ్చారు. వీళ్లు పెండింగ్ చలానాల మొత్తంలో 25 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అంటే 75 శాతం రాయితీ ప్రకటించారు. ఉదాహరణకు ... ఓ బైకుపై వివిధ ఉల్లంఘనల కింద రూ.10వేల మొత్తానికి చలానాలు ఉంటే... రూ.2500 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.. సర్వీస్ చార్జి కింద వసూలు చేసే రూ.35ను కూడా రాయితీలో భాగంగా పరిగణిస్తారు. అలాగే కార్లు, లారీలు, ఇతర ఫోర్ వీలర్ వాహనాలకు పెండింగ్ చాలన్లలో 50 శాతం రాయితీ ప్రకటించారు. అదే విధంగా ఉల్లంఘనుల్లో ఆర్టీసీ బస్ డ్రైవర్లు కూడా ఉన్నందున... వారికి 70శాతం రాయితీ ప్రకటించారు. వీళ్లు 30 శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇక కొవిడ్ నేపథ్యంలో మాస్కులు ధరించని వారికి విధించిన రూ.1000 పెనాల్టీలోనూ భారీగా డిస్కౌంట్ ఇచ్చారు. 90శాతం రాయితీ ఇచ్చి కేవలం రూ.100 చెల్లిస్తే చాలని స్పష్టం చేశారు. వాహనదారులు ఆయా చలానాలను ఆన్లైన్లో చెల్లించవ చ్చని అధికారులు తెలిపారు. అంతేగాకుండా రోడ్లపైకి తోపుడు బండ్లను తీసుకొచ్చి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినవారికి 80 శాతం రాయితీ ప్రకటించారు. రాయితీలు ప్రకటించడం ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.500 కోట్లకు మించి జమ అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా.. ఈ రాయితీలన్నీ మార్చి 1 నుంచి 31 వరకు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై ఎప్పటిలాగే చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. కరోనా కాలంలో ఆర్థికంగా చితికిపోవడం, ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజానీకానికి కాస్త ఉప శమనం కల్పించాలనే ఆలోచనతో చలానాల్లో రాయితీ ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ లోక్ అదాలత్ పేరిట... డిస్కౌంట్ తర్వాత చెల్లించాల్సిన రుసుమును ఆన్లైన్ లేదా గూగుల్పే, ఫోన్పె లాంటి గేట్వేలు, మీసేవా, టీసేవా కేంద్రాల నుంచి కూడా చెల్లించవచ్చని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. అన్ని రకాల వాహనదారులకు ఈ రాయితీలు ఊరటనిచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రకటించిన వన్ టైమ్ బంపర్ ఆఫర్ చలానాల బాకీ చెల్లించడానికి మంచి అవకాశం ఉంది.
- ఆ కేసులకు జైలు శిక్ష లేదు.. ఫైన్ మాత్రమే..!
ట్రాఫిక్ చలానాల విషయంలో భారీ రాయితీలు ప్రకటించి వాహనదారులకు ఊరట కల్పించిన పోలీసు ఉన్నతాధికారులు... మందుబాబులకూ ఉపశమనం కల్పించారు. పెండింగ్లో ఉన్న డ్రంకెన్ డ్రైవ్ కేసు లను ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా క్లియర్ చేయాలని నిర్ణయించారు. ఈ కేసుల్లో పట్టుబడినవారికి జరిమానాల విషయంలో భారీ రాయితీలు ప్రకటించారు. అలాగే ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న కేసుల్లో ఎలాంటి జైలు శిక్షలు లేకుండా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్ని కమిషనరేట్ల పరిధిలోని న్యాయస్థానాల్లో మార్చి 12 వరకు లోక్ అదాలత్'లు ఏర్పాటుచేయనున్నట్టు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. డ్రంకె న్ డ్రైవ్ లో పట్టుబడి వాహనాలు వదిలేసుకున్న అనేకమంది... జైలు శిక్ష పడుతుందేమోనని భయపడి పోలీసులను, కోర్టులను సంప్రదించడం మానేశారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా రూ.10వేలకు పైగా చెల్లించాల్సి రావడంతో పాత బైక్'లను వదిలేసుకున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లోనూ రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
- డ్రంకెన్ డ్రైవ్ రాయితీలు ఇలా...
డ్రంకెన్ డ్రైవ్ పోలీసులు చెక్ చేసినప్పుడు బ్రీత్ ఎనలైజర్స్లో నమోదైన బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ పాయింట్లు, అలాగే ఆ సమయంలో నడుపుతున్న వాహనం బైకా, కారా, లారీనా అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని జరిమానాల రాయితీలను నిర్ణయించారు. టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్, హెవీ వాహనాలకు వేర్వేరుగా రాయితీలను ప్రకటించారు. అలాగే బాధితులు ఒకవేళ డ్రంకెన్ డ్రైవ్లో రెండోసారి పట్టుబడినవారైతే.. రాయితీ తర్వాత నిర్ణయించిన జరిమానాకు రెండింతలు (డబుల్) చెల్లించాల్సి ఉంటుంది.
- డ్రైవింగ్ లైసెన్స్ లేని కేసులకూ రాయితీ
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపి పట్టుబడ్డ కేసులు, మైనర్ డ్రైవింగ్ కేసుల్లో సైతం రాయితీలు ప్రకటించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఏర్పాటుచేసిన ప్రత్యేక లోక్ అదాలత్ తోనే పెండింగ్ కేసులను క్లియర్ చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. ఏవైనా సలహాలు, సూచనలు కావాలంటే సంబంధిత ట్రాఫిక్ పోలీసులను సంప్రదించాలని తెలిపారు. ఈ రాయితీలతో లోక్ అదాలత్ ఇప్పటికే ప్రారంభమైందని, మార్చి 12న ముగుస్తుందని వెల్లడించారు. వాహనదారులు వెంటనే తమ పెండింగ్ కేసులను క్లియర్ చేసుకోవాలన్నారు. గడువు ముగిసిన తర్వాత పాత పద్ధతిలోనే జరిమానాలు యధావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.
ఆ కేసులకు జైలు లేదు.. ఫైన్ మాత్రమే.. II చలనాలపై బంఫర్ ఆఫర్ ప్రకటించిన పోలీస్ శాఖ
Reviewed by Ashu Yadav
on
6:05 PM
Rating:
No comments: